పోలీస్ స్టేషన్ లో అమానుషం... వీడియో ఇదిగో!

పోలీస్ స్టేషన్ లో అమానుషం... వీడియో ఇదిగో!
  •                                         BSR NEWS
  • కాళ్లకు సంకెళ్లు వేసి చీపురుతో ఊడ్పించిన పోలీసులు
  • నిజామాబాద్ జిల్లా స్టేషన్‌లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ఓ కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితుడి పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. కాళ్లకు సంకెళ్లు వేసి స్టేషన్ లో కూర్చోబెట్టారు. సంకెళ్లతోనే నిందితుడితో స్టేషన్ లో పనిచేయించుకున్నారు. కాళ్లకు సంకెళ్లతో చీపురు పట్టుకుని నిందితుడు ఊడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన.
 
జిల్లాలోని బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి కాళ్లకు సంకెళ్లతో కనిపించాడు. సాధారణంగా నేరస్థులను స్టేషన్ కు తీసుకొచ్చాక సెల్ లో వేసి తాళం వేస్తారు. బోధన్ పోలీసులు మాత్రం ఓ పెద్ద చైన్ ను నిందితుడి కాళ్లకు బిగించి అతడితో స్టేషన్ లో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. స్టేషన్ ను క్లీన్ చేయాలని చెప్పడంతో చీపురు పట్టుకుని మెల్లిగా నడుస్తూ సదరు నిందితుడు ఊడ్వడం వీడియోలో కనిపిస్తోంది.

గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. చిన్న చిన్న కేసుల్లో అరెస్ట్ అయిన వారితో ఇలా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాళ్లకు సంకెళ్లు వేసి మరీ పనిచేయించుకోవడం అమానుషమని విమర్శిస్తున్నారు.